మూడు ముక్కలైన విమానం..

Update: 2020-02-06 16:37 GMT

టర్కీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. దాంతో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 179 మంది గాయపడ్డారు. పెగాసస్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్‌ విమానం ఇజ్మీర్ ప్రావిన్స్ నుండి బయలుదేరి ఇస్తాంబుల్‌ చేరుకుంది.. అక్కడ సబీహా గోకెన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ సమయంలో విమానం రన్‌వే నుంచి అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. దాంతో విమానం లోనుంచి మంటలు చెలరేగాయి.

ఈ క్రమంలో రన్‌వే మీద కూలి మూడు ముక్కలైంది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. 177 మంది ప్రయాణికులు మరియు మరో ఇద్దరు సిబ్బంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఘటనపై టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో ముగ్గురు టర్కీ వాసులు మృతి చెందారని.. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ఇస్తాంబుల్ గవర్నర్ అలీ యెర్లికాయ కూడా ఘటనపై ఆరాతీశారు.

Similar News