నిర్భయ కేసు.. ఢిల్లీ పటియాలాహౌజ్ కోర్టు సంచలన వ్యాఖ్యలు

Update: 2020-02-08 09:25 GMT

నిర్భయ కేసు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. దోషులకు ఉరిశిక్ష అమలు ప్రహసనంగా మారింది. తాజాగా ఢిల్లీ పటియాలాహౌజ్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దోషులకు బతికే అవకాశాలు ఉన్నాయని న్యాయ వ్యవస్థ చెబుతున్నప్పుడు ఉరి తీయాలనుకోవడం ఘోరమైన పాపం అని కోర్టు పేర్కొంది. న్యాయపరమైన ప్రక్రియ ముగియనందున డెత్ వారెంట్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. నిర్భయ దోషులకు మరణదండన అమలు చేయడానికి డెత్ వారెంట్ ఇవ్వాలంటూ తీహార్ జైలు అధికారులు పటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఉరి తీయడానికి కొత్త డేట్ ఇవ్వాలని కోరారు. విచారణ జరిపిన కోర్టు, దోషులకు ఇంకా అవకాశాలున్నాయని తెలిపింది. ఇప్పటికిప్పుడు కొత్త డెత్ వారెంట్ ఇవ్వడం సాధ్యం కాదంటూ తీహార్ జైలు అధికారుల పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇక, సుప్రీంకోర్టు కూడా విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై స్టేను తొలగించాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. నిర్భయ కేసులో దేశం సహనాన్ని పరీక్షించింది చాలని, ఇంకా ఇంకా పరీక్షించవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్‌తా సూచించారు. ఇకనైనా దోషులను ఉరి తీయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. నిర్భయ దోషులకు నోటీసులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్టు అంగీకరించలేదు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

అయితే..కోర్టుల్లో కేసు వాయిదాలు పడుతుండటం..నిర్భయదోషులకు శిక్ష అమలులో జాప్యం అవుతుండటంపై నిర్భయ తల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితురాలి పక్షాన కాకుండా..నేరం చేసిన వారి పక్షాన ఎక్కువగా ఆలోచనలు జరుగుతున్నాయని అన్నారామె.

నిర్భయ దోషులకు ఇప్పటివరకు రెండు సార్లు డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. జనవరి 22న ఒకసారి, ఫిబ్రవరి 1న రెండోసారి ఉరి శిక్ష అమలు వాయిదా పడింది. పవన్ గుప్తా మినహా మిగతా ముగ్గురు దోషుల చట్ట పరమైన మార్గాలన్నీ మూసుకుపోయాయి. ముగ్గురు దోషుల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. పవన్ గుప్తా మాత్రం ఇప్పటి వరకు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరలేదు. అది పూర్తైతే గానీ శిక్ష అమలు సాధ్యమయ్యేలా లేదు.

Similar News