9 నెలల్లో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు: నారాలోకేష్

Update: 2020-03-02 17:37 GMT

రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అనర్థమని అన్నారు మాజీ మంత్రి నారా లోకేష్. తెలుగు రైతు వర్క్ షాప్ లో పాల్గొన్న ఆయన.. వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. జగన్ రైతు వ్యతిరేకి అన్నారు. గతంలో రైతు రుణమాఫీ అవసరం లేదని.. ఇప్పుడు అనేక హామీలిచ్చి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుకి విత్తనాలు కూడా ఇవ్వాలని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు లోకేష్. విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తినే రోజులు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సున్నా వడ్డీకే రుణాలంటూ.. గతంలో లేని పథకంలా హడావిడి చేసి దొరికిపోయారని ఎద్దేవా చేశారు.

3 వేల కోట్లతో ధరల స్థరికీరణ నిధి కేటాయిస్తామని.. పంట వెయ్యకముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తామని.. మ్యానిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చిన జగన్.. పండించిన పంటకి గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు బకాయిలు 2 వేల కోట్లు ఉన్నాయని.. ఒక్క ఉత్తరాంధ్ర లోనే వెయ్యి కోట్లు చెల్లించాల్సివుందన్నారు.

9 నెలల వైసీపీ పాలన లో 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నారా లోకేష్ చెప్పారు. వర్షాలు బాగా పడినా ఫిబ్రవరి నెలలోనే తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం ఇక సాగునీరు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న రైతులు, కౌలు రైతులందరికీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని చెప్పిన జగన్.. రాష్ట్రంలోని 16 లక్షల మంది కౌలు రైతుల్లో రైతు భరోసా ఇచ్చింది కేవలం 59 వేల మందికి మాత్రమేనని అన్నారు.

70 లక్షల మందికి రైతుల రుణమాఫీ కోసం టీడీపీ ప్రభుత్వం 24 వేల 500 కోట్లు ఖర్చుచేసిందని లోకేష్ గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం మాత్రం రైతులను నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. ఇక, 25 లక్షల ఇళ్ల స్థలాలు పెద్ద బోగస్ అన్నారు లోకేష్. తెలుగు రైతు విభాగం రైతులకు అండగా నిలవాలని.. రైతులు ఎదుర్కుంటున్న సమస్యల పై ఎప్పటికప్పుడు ఉద్యమించాలని పిలుపునిచ్చారు నారా లోకేష్.

Similar News