పట్టణప్రగతి పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలపై జిల్లాల అదనపు కలెక్టర్లు, వివిధ విభాగాల అధిపతులు, పురపాలకశాఖ ముఖ్య అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మోడల్ మార్కెట్లు, పార్కులు, డంప్‌యార్డులు, పబ్లిక్‌టాయిలెట్లు, స్ట్రీట్‌వెండింగ్ జోన్లు, నర్సరీలు, శ్మశానవాటికలు, అర్బన్ లంగ్‌స్పేసెస్, ఓపెన్‌జిమ్స్ వంటి సౌకర్యాలు కచ్చితంగా ఉండేలా చూడాలని కోరారు. వీటిని వచ్చే నాలుగున్నరేండ్లలో పూర్తిచేయాలన్నారు. ఏ పట్టణమైనా ఒకేరోజులో ఆదర్శంగా మారదని, నిరంతర అభివృద్ధి కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రతి అదనపు కలెక్టర్‌కు తన పరిధిలోని పట్టణాల వివరాలు మొత్తం తెలిసి ఉండాలని చెప్పారు.
పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన తొలిదశ పట్టణప్రగతి విజయవంతమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. పదిరోజులపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రయత్నం చేశారని కొనియాడారు. పట్టణాల్లో గుణాత్మకమార్పు తేవడంలో ఈ కార్యక్రమం తొలిఅడుగుగా భావిస్తున్నామని తెలిపారు. పదిరోజుల కార్యక్రమంతో పట్టణాల్లో స్వచ్ఛమైన మార్పు కనిపిస్తున్నదని, మంచి మార్పునకు బీజం పడిందని చెప్పారు. పురప్రజల కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన నూతన మున్సిపల్ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి విజయం సాధించిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పట్టణ ప్రగతి కోసం పనిచేసిన ప్రతి ఉద్యోగికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పట్టణప్రగతితో పట్టణాల్లో దీర్ఘకాలిక సమస్యలను గుర్తించామని, వెంటనే పరిష్కరించగలిగే పారిశుద్ధ్యం వంటి సమస్యలపై ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని ఆదేశించారు.