రక్తి కట్టిస్తున్న మధ్యప్రదేశ్ క్యాంపు రాజకీయాలు

Update: 2020-03-11 13:38 GMT

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియ కాసేపట్లో బీజేపీలో చేరనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే మంత్రి పదవిని కూడా ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. సింధియాకు మద్దతుగా రాజీనామా చేసిన మిగితా ఎమ్మెల్యేలు కూడా బీజేపీలు చేరనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు మధ్యప్రదేశ్‌ రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఇటు కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు జంపింగ్‌లతో అలర్ట్‌ అయ్యాయి. అనుమానం ఉన్న అందరి నేతలపై పార్టీ అధిష్టానం నిఘా పెట్టింది. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌కు తరలిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అందర్నీ జైపూర్‌లోని రిసార్ట్స్‌కు తరలించారు. అటు బీజేపీ నుంచి కూడా వలసలు ఉంటాయనే ప్రచారంతో అలర్ట్‌ అయ్యారు. వారిని క్యాంపుకు తరలిస్తున్నారు.

ఇటు రాజ్‌భన్‌కు చేరుకున్న గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాజకీయ పరిణమాలను గమనిస్తున్నారు. కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోమని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బీజేపీ సైతం భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తోంది. కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిపోవడం.. ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమకు సరిపడ బలం ఉండడంతో.. దీనిపై చర్చిస్తున్నారు. తమకు బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Similar News