ఎన్పీఆర్‌పై అనుమానాలొద్దు: అమిత్‌ షా

Update: 2020-03-13 09:00 GMT

ఢిల్లీ అలర్లపై మొన్న లోక్ సభ వేదికగా అల్లరి మూకలకు వార్నింగ్ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..నిన్న రాజ్యసభలో మాట్లాడారు. ఎన్ఆర్పీ, సీఏఏతో పాటు ఢిల్లీ అల్లర్లపై ఆయన వివరణ ఇచ్చారు. ఢిల్లీ అలర్లకు పాల్పడ్డవారిని ఎంతటి వారైనా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అల్లర్లపై చర్చ నుంచి తామేనాడూ పారిపోలేదన్న అమిత్ షా..హోలి ప్రశాంత వాతావరణంలో జరగాలన్న ఉద్దేశంతోనే చర్చను ఆలస్యం చేశామన్నారు. అల్లర్లకు పాల్పడిన వారిలో ఫేస్ రికగ్నేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఇప్పటివరకు 1922 మంది ముఖాలను గుర్తించినట్టు వివరించారు. వారిలో 336 మంది యూపీ నుంచి వచ్చినవారు ఉన్నారన్నారు. ఇప్పటివరకు 700 ఎఫ్ ఐఆర్ లను నమోదు చేశారని, 2600 మందిని అరెస్టు చేసినట్టు అమిత్ షా స్పష్టంచేశారు.

అల్లర్లకు కారణమైన నిందితులను గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఆధారాలు సేకరిస్తున్నట్టు అమిత్ షా చెప్పారు. చట్టం అంటే అల్లరిమూకల్లో వణుకు పుట్టేలా భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటేనే భయపడేలా శిక్షలు ఉంటాయన్నారు.

ఇక ఎన్పీఆర్ పై ప్రజల్లో నెలకొన్న అపోహాలపైన అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఎన్ పీఆర్ కు ఎలాంటి పత్రమూ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. నిర్దిష్టమైన సమాచారం ఇవ్వకూడదని ఎవరైనా అనుకుంటే వారిని ఏ ప్రశ్నలూ అడగరని చెప్పారు. సమాచారం ఇవ్వడం, ఇవ్వకపోవడం ఐచ్ఛికమేనన్నారు. ఎన్ పీఆర్ పై ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. అలాగే సీఏఏతో పౌరసత్వం పోతుందని కొందరు అపోహలు సృష్టించి మైనారిటీలను తప్పుదోవ పట్టించారని అమిత్ షా ఫైర్ అయ్యారు.

Similar News