తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమవుతున్న ప్రభుత్వాలు
తెలంగాణలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. మరో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 44కి చేరింది. కుత్బుల్లాపూర్‌కి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చినట్టు తేలింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వైద్యులకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. దోమలగూడాకు చెందిన 43 ఏళ్ల వైద్యుడికి కరోనా వచ్చింది. కరోనా రోగితో సన్నిహితంగా ఉండడంతో అతడికి సోకినట్టు అధికారులు నిర్ధార్ధించారు. తరువాత ఆయన భార్య 36 ఏళ్ల వైద్యురాలికి కూడా కరోనా సోకింది. తెలంగాణలో మొదటి సారిగా ఇద్దరు వైద్యులకు కరోనా సోకింది. దీంతో తెలంగాణలో ప్రైమరీ కాంటాక్ట్ కేసుల సంఖ్య 9కి పెరిగింది.
బుధవారం రాత్రి కూడా రెండు పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. మూడేళ్ల బాలుడు, ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మూడేళ్ల వయసు బాలుడికి ఈ వ్యాధి సోకడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ఆ కుటుంబం బాలుడితో సహా ఇటీవల సౌదీ అరేబియా వెళ్లివచ్చింది. బాలుడిలో జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది.
వైద్యులకు కూడా కరోనా వ్యాపించడంతో ఆసుపత్రుల్లో, కరోనా వార్డుల్లో పనిచేసే వైద్యసిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎన్ 95 మాస్కులు, ప్రత్యేక కళ్లజోడు, సురక్షిత దుస్తులు అందజేస్తున్నట్లు చెప్పారు మంత్రి ఈటెల రాజేందర్. కరోనా అనుమానిత వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించే వైద్యసిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు గాంధీ ఆస్పత్రిని పూర్తి కరోనా వార్డుగా మారుస్తున్నట్లు మంత్రి ఈటెల స్పష్టం చేశారు.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరింది. గుంటూరు, విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా పాజిటివ్ కేసులు వచ్చాయి. మరో 13 మంది అనుమానితుల రిపోర్టులు రావాల్సిఉంది. వాషింగ్టన్ నుంచి విజయవాడ వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. గుంటూరు జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన గుంటూరు వాసికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఈ నెల 14 న ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశంలో పాల్గొన్న ఆ వ్యక్తి ఈ నెల 19న గుంటూరు వచ్చారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో.. టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. కరోనా రోజురోజుకూ విస్తరిస్తుండడంతో ఎప్పటికప్పుడు కరోనా కట్టడిపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్.
ఇప్పటికే పాజిటివ్ కేసులు పదికి చేరడంతో ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. హోం క్వారంటైన్ అయిన వారి వివరాలు సేకరించారు. వారికి మరోసారి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అటు గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశావర్కర్ల సాయంతో ఇంటింటి సర్వే పూర్తి చేస్తున్నారు.