పీఏం కేర్స్‌ ఫండ్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్ భారీ విరాళం

Update: 2020-03-30 23:37 GMT

కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రధాని మోదీ ప్రకటించిన 'పీఎమ్- కేర్స్ ఫండ్' కు రిలయన్స్‌ భారీ విరాళం ప్రకటించింది. కరోనాపై పోరాటం కోసం తమ వంతు సాయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్ల విరాళం ప్రకటించింది. దీంతోపాటు అదనంగా మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు రూ.5 కోట్ల చొప్పున సాయం అందించినట్లు రిలయన్స్ తెలిపింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ముంబైలో ప్రత్యేకంగా కోవిడ్-19 హాస్పిటల్‌ను రిలయన్స్ ఏర్పాటు చేస్తుందని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ఇప్పటికే ప్రకటించారు. కరోనా చికిత్స కోసమే దేశంలో నిర్మించే తొలి హాస్పిటల్ ఇదేనన్నారు. అన్ని బెడ్లకు వెంటిలేటర్లు, పేస్‌మేకర్లు, డయాలసిస్ మెషిన్లు, పేషెంట్ మానిటరింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ప్రకటించింది. పది రోజుల్లో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది పేదలకు భోజనం సరఫరా చేయడంతో పాటు ప్రతిరోజూ లక్ష మాస్క్‌లను వైద్య సిబ్బంది, ఆరోగ్య సంరక్షకులకు సరఫరా చేస్తామని తెలిపింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వాహనాలకు దేశవ్యాప్తంగా ఉచిత ఇంధనాన్ని సమకూరుస్తామని పేర్కొంది.

Similar News