తన పేరు మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్తకు, తనకు ఎలాంటి సంబంధం లేదని టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా తెలిపారు. ట్విటర్‌లో ఈ మేరకు స్పందించిన ఆయన.. "ఆ పోస్టు నేను చేసింది కాదని.. నేను ఏదైనా చెప్పదల్చుకుంటే.. అధికారిక మార్గాల్లోనే చెబుతాను" అని అన్నారు.
అయితే.. కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ పరిస్థితిపై రతన్ టాటా కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందంటూ ఎందరో నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ.. మానవ స్ఫూర్తి, దృఢ సంకల్పం గురించి వీళ్లకేమీ తెలియదని నాకు అనిపిస్తుంది. నిపుణులు చెప్పే మాటే నిజమైతే... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిషత్తే లేదనుకున్న జపాన్ మూడు దశాబ్దాల్లో.. అమెరికాకు పోటీగా నిలిచింది. నిపుణులు చెప్పేదే నిజమైతే అరబ్బుల కారణంగా ఇజ్రాయెల్ కు.. ఈ రోజు ప్రపంచంలో చోటే ఉండకూడదు. నిపుణులమని చెప్పిన దాని ప్రకారం 1983లో భారత్ కు క్రికెట్ ప్రపంచ కప్ వచ్చి ఉండకూడదు. ఇవ్వన్నీ చుస్తే.. నిపుణులు చెప్పినది వాస్తవాలకు దూరంగా ఉంది. కనుక.. మనం కరోనాను జయిస్తామని.. భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ పునర్వైభవం సంతరించుకుంటుందని చెప్పగలను’’ అని సదరు పోస్టులో రాశారు.
అయితే.. ఈ వార్తపై రతన్ టాటా స్పందించటంతో అది ఫేక్ వార్తా అని నిర్దారణ అయింది.