కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో.. ఎకానమీ పరంగా అనేక తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం.. 1.7 లక్షల కోట్ల రూపాయల స్టిమ్యులస్ ప్యాకేజ్‌ని కేంద్రం ప్రకటించింది. రుణాలపై మారటోరియం వంటి పలు చర్యలను చేపట్టినా.. అత్యధికంగా నష్టాలను ఎదుర్కుంటున్న MSME రంగానికి మాత్రం ఎలాంటి ఊరట కల్పించలేదు. ఇప్పుడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడం కోసం మరో ఉద్దీపన పథకాన్ని ప్రకటించనున్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి.
కరోనా వైరస్ బారి నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సుమారు లక్ష కోట్ల రూపాయాలతో ఆ ప్యాకేజీ ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ఆ ప్యాకేజీ ఉంటుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే మోదీ ప్రభుత్వం పేదల కోసం తొలి ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. సుమారు లక్షా 70 వేల కోట్లతో ఆ ప్యాకేజీని విడుదల చేశారు. పేదలకు, కూలీలకు నేరుగా నగదు బదిలీ చేసే ఉద్దేశ్యంతో.. ఈ ప్యాకేజీని ప్రకటించారు. అయితే పారిశ్రామిక రంగానికి కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కానీ పూర్తి అంచనా వేసిన తర్వాతనే ఆ ప్యాకేజీ ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.