తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేసీఆర్ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. అయినా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా కరోనా పాజిటిల్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ విషయాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. మున్సిపల్, వైద్యారోగ్యశాఖల మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు ప్రతిరోజూ ఉదయం ప్రగతిభవన్‌లో జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల వారీగా ప్రత్యేక సమీక్ష జరుపాలని, పరిస్థితిని బట్టి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో కరోనా నివారణ, ప్రస్తుత పరిస్థితులపై హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, వైద్య ఆరోగ్య, మున్సిపల్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు ఈటల, కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ అదుపు చేయటానికి అనుసరించవలసిన వ్యూహం, ప్రస్తుత స్థితిగతులపై చర్చిస్తున్నారు.