వైద్యులు, సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా మహమ్మారిపై పోరాడటానికి వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ మరియు ఆశా కార్మికులు తమ వంతు కృషి చేస్తున్నారు.. అయితే వారికి సహకరించకుండా కొందరు దాడులు , వేధింపులకు పాల్పడుతున్నారు.. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది. ఈ క్రమంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
కాగా వైద్యులు , సిబ్బందిపై దాడులకు పాల్పడితే బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. కొత్త నిబంధన ప్రకారం ఆరోగ్య సంరక్షణ కార్మికులపై నేరాలకు పాల్పడిన వ్యక్తికి మూడు నెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ .50 వేల నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధించవచ్చని మంత్రి జవదేకర్ చెప్పారు. గాయాలు తీవ్రంగా ఉన్న సందర్భాల్లో, శిక్ష ఆరు నెలల నుండి ఏడు సంవత్సరాల వరకు ఉంటుందని.. 1-5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది అని మంత్రి విలేకరులతో అన్నారు.