80శాతం కేసులు లక్షణాలు లేకుండానే : ఉద్ధవ్‌ ఠాక్రే

Update: 2020-04-27 08:09 GMT

కరోనావైరస్ వ్యాప్తితో భారతదేశంలో అత్యంత నష్టపోయిన రాష్ట్రం మహారాష్ట్ర.. ఇక్కడ 7,000 మార్కును దాటింది. రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల మధ్య, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రంలో 80 శాతం మందికి లక్షణాలు లేకుండానే వైరస్ పాజిటివ్ అని తేలిందని అన్నారు. కేవలం 20 శాతం మందికి తేలికపాటి, తీవ్రమైన లేదా క్లిష్టమైన లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ఎవరు కూడా వాటిని దాచిపెట్టకుండా.. పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

వలస కూలీలు భయపడవద్దని, తాను కేంద్రంతో మాట్లాడుతున్నానని, సాధ్యమైనంత త్వరలో మంచి జరుగుతుందని చెప్పారు. అక్షయ తృతీయ, రంజాన్ వంటి పండుగలను ఇంటి వద్దే జరుపుకోవడం, లాక్డౌన్ సమయంలో సామాజిక దూరం పాటించినందుకు సిఎం ఆదివారం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రంజాన్ సందర్భంగా ముస్లిం ప్రజలు ప్రార్థన కోసం బయటకు వెళ్లవద్దని ఠాక్రే విజ్ఞప్తి చేశారు. కాగా మహారాష్ట్రలో ప్రస్తుతం 7,628 కేసులు ఉన్నాయి, ఇది దేశంలోనే అత్యధికం. కేసులలో ఎక్కువ భాగం దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి వచ్చినవి.

Similar News