కరోనాతో కలిసి బతకాల్సిందే.. లేదంటే ఆకలి చావులు.. : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
అనుకోని ఉపద్రవం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్ విధించి వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగినా, ప్రజలు ఎన్ని రోజులు పనులు మానుకుని ఇంటికే పరిమిత మవుతారు. ఈ విధానం మరికొన్ని రోజులు కొనసాగితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఉపాధి లేక, తిండిలేక మరణించే వారి సంఖ్య ఎక్కువవుతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి హెచ్చరించారు. మహమ్మారి కారణంగా మరణించే వారి సంఖ్య కంటే ఆకలి చావులే ఎక్కువవుతాయని ఆయన అంటున్నారు. కరోనాతో కలిసి జీవనం సాగించేందుకు సిద్ధపడాలన్నారు.
బుధవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన వెబినార్‌లో ఆయన ప్రసంగించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా బారిన పడి మరణించిన వారి శాతం తక్కువే అని అన్నారు. ఇప్పుడు సంభవించిన కరోణా మరణాల లెక్క చూస్తున్నారు కానీ, వివిధ కారణాల వల్ల భారత్‌లో ఏటా 90 లక్షల మంది చనిపోతుంటారని తెలిపారు. అందులో నాలుగో వంతు కాలుష్యపు కోరల్లో చిక్కుకుని మరణిస్తున్నారని అన్నారు. గత రెండు నెలలో వెలుగు చూసిన కరోనా మరణాల రేటు ఊహించినంత లేదన్నారు.
భారత్‌లో 19 కోట్ల మంది అసంఘటిత కార్మిక రంగంలో పని చేస్తున్నారని, లాక్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగితే వీరిలో చాలా మంది జీవనోపాధి కోల్పోయి ఆకలి కేకలతో మరణిస్తారని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేదిశగా ప్రయత్నాలు సాగాలని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సూచించారు. దేశంలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండడానికి కారణం.. భారతీయుల్లో జన్యుపరమైన అంశాలు, వేడి వాతావరణం లేదా బీసీజీ టీకాలు తీసుకొని ఉండడం కారణమై ఉండొచ్చని మూర్తి తెలిపారు.
అయితే వీటిపై పరిశోధనలు సాగించాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షిత నిబంధనల నడుమ ఉద్యోగులు పనిచేసేలా చూడాలన్నారు. పని ప్రదేశంలో ఒక షిప్ట కాకుండా మూడు షిప్ట్‌ల్లో పని చేసేలా చూస్తే రద్దీ తగ్గుతుందని, భౌతిక దూరాన్ని పాటించడానికి వీలవుతుందని అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా భారత ఐటీ రంగానికి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.