లాక్డౌన్‌ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రెండే మార్గాలు..

Update: 2020-05-01 14:26 GMT

ఇకపై విమాన ప్రయాణం అంత వీజీ కాదు. కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు రెండు నెలలు రోడ్డు మీద రహదారులు, ఆకాశ మార్గాలు మూత పడ్డాయి. ఈనెల 4 నుంచి విమాన ఆపరేషన్లకు సిద్దంగా ఉండాలంటై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేశారు. అందుకు తగిన మార్గదర్శకాలను కూడా సూచించడంతో కొంత పాక్షిక సడలింపులకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒకవేళ విమానాలు నడిపితే సోషల్ డిస్టెన్స్‌లో భాగంగా 30 శాతం ప్రయాణీకులకే పరిమితమని సమాచారం. అయితే ఇది మాత్రం ఆచరణ సాధ్యం కాదని ఎయిర్‌లైన్స్ మేనేజర్లు అంటున్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ గిరి మధుసూనరావు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై మేనేజర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేవలం 30 శాతం మందినే ఎక్కించుకుంటే వయబిలిటీ ఉండదని, అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.

ఇలాంటప్పుడు విమానయాన సంస్థలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్.. దీని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీజీఎఫ్ రాదు. అలాంటి సమయంలో ప్రోత్సాహకంగా ఎయిర్ పోర్టులలో ఏఏఐలకు చెల్లించే ఫీజుల విషయంలో మాత్రం మినహాయింపులు ఇవ్వొచ్చు. దీనివల్ల నెలరోజుల్లో కోల్పోయిన ఆదాయంలో కొంత మేర ఉపశమనం లభిస్తుంది.

ఇక రెండో ఆప్షన్ చార్జీలు పెంచడం. 30 శాతం ప్రయాణీకులనే అనుమతిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే ఛార్జీలు డబ్బుల్ చేస్తేనే సంస్థ కోలుకోగలదు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపార వేత్తలు తప్ప సామాన్య జనం విమానం ఎక్కాలంటే వీపు మోతే.

Similar News