ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు ఐదేండ్ల తరువాత ఇరు దేశాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. చియోర్వాన్‌లోని రెండు దేశాల సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూ..ఇరు దేశాల జవాన్లు కాల్పులు జరుపుకున్నారు. దాదాపు మూడు వారాల అజ్ఞాతం వీడి కిమ్ జోంగ్ ఉన్ బయటకు వచ్చిన మర్నాడే సరిహద్దుల్లో దక్షిణ కొరియా సైనిక పోస్టులపై కాల్పులకు దిగడం గమనార్హం. సరిహద్దుల్లోని తమ సైనిక స్థావరంపై ఉత్తర కొరియా వైపు నుంచి పలు రౌండ్లు కాల్పులు జరిపారని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కాల్పుల్లో తమ సైనికులు ఎవరూ గాయపడలేదని జేసీఎస్ పేర్కొంది. మా సైన్యం రెండు రౌండ్ల కాల్పులు జరిపి, తమ నిబంధనల ప్రకారం హెచ్చరికలు జారీచేసిందని వివరించింది. అయితే కాల్పులకు కారణం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. అటు కాల్పుల ఘటనతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొంది