ఉద్యోగుల తొలగింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీకి ట్విట్టర్ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో టీటీడీలో పని చేస్తున్న 1400 మంది బెట్ సోర్సింగ్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయం అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ కూడా విధుల నుంచి తొలగించకూడదని స్వయంగా నరేంద్ర మోదీ చెప్పారని గుర్తుచేశారు.
ఈ క్రమంలో ఒక్క కలం పోటుతో 1400 మంది కార్మికులను విధుల నుంచి తొలగించడం సహేతుకం కాదని అన్నారు. వీరి తొలగింపును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకి, కార్యనిర్వహణాధికారికి తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.