ఐదు గ్రామాల్లో గ్యాస్ లీకేజి ప్రభావం

Update: 2020-05-07 19:28 GMT

విషవాయువు కౌగిలిలో చిక్కుకొని విలవిల్లాడుతోంది విశాఖ. ఆర్‌.ఆర్.వెంకటాపురంలోని L.G. పాలిమర్స్ పరిశ్రమ నుంచి లీకైన స్టైరీన్ గ్యాస్‌తో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏ క్షణం..ఏం జరుగుతుందోనని..జనం బిక్కుబిక్కుమంటున్నారు. విషవాయువు కారణంగా 5 గ్రామాలు ప్రభావితం అయ్యాయి. ఈ గ్రామాల్లో దాదాపు 15వేల మంది నివసిస్తున్నారు. ఆర్‌.ఆర్. వెంకటాపురం, వెంకటాపురం, పద్మనాభనగర్, నందమూరినగర్ ఎస్సీ, బీసీ కాలనీలపై విషవాయువు ప్రభావం చూపింది. ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక పశువులు, పిచ్చుకలు, కుక్కలు వంటి మూగ ప్రాణులు వందల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి.

గ్యాస్‌ లీకేజీ ఘటనకు కారణమైన L.G. పాలిమర్స్ పరిశ్రమపై కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. మృతులను మేకా కృష్ణమూర్తి, గంగరాజు, అప్పల నర్సమ్మ, గంగాధర్, నారాయణమ్మ, కందన శ్రియ, గ్రీష్మ, చంద్రమౌళిగా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విశాఖ KGHలో 193 మంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 66, ఆరోగ్య కేంద్రాల్లో మరో 57 మంది చికిత్స పొందుతున్నారు..ప్రమాద ఘటనపై పరిశ్రమల శాఖ జీఎం కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

L.G. పాలిమర్స్‌నుంచి లీకైన స్టైరీన్ గ్యాస్‌ 3 నుంచి 5 కిలోమీటర్ల మేర విస్తరించినట్లు భావిస్తున్నారు. 48 గంటల పాటు దీని ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. విశాఖ చుట్టున్న విశాలమైన కొండల కారణంగా ఈ గ్యాస్.. మరికొంత ఎక్కువ సమయం నగరంపై స్థిరంగా ఉంటే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

Similar News