ఏపీ కొత్త ఎత్తిపోతలకు ప్రయత్నాలు చేయడంపై తెలంగాణ ఆగ్రహం

Update: 2020-05-12 08:35 GMT

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడంపై KCR అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేసే ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామన్నారు. కృష్ణా వాటర్ బోర్డులో ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా KCR పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో ఎక్కడా రాజీలేని ధోరణి అవలంభిస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 TMCల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల చేపట్టాలని ఇటీవలే AP ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై జీవో కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ప్రగతి భవన్‌లో KCR ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు ఈటల రాజేందర్, మహమూద్ అలీ, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్‌తోపాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, నీటి పారుదల సలహాదారు ఎస్.కె.జోషి, CS సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టు నీటి వాడకం విషయంలో ఏపీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని KCR అన్నారు.

తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా కొత్త నీటి పారుదల ప్రాజెక్టు చేపట్టాలంటే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదని KCR అభ్యంతరం తెలిపారు. కొత్త ప్రాజెక్టు పేరుతో కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుందని KCR ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా KRMB ఆదేశాలివ్వాలన్నారు. గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తాము ఏపీకి స్నేహహస్తం అందించిన విషయాన్ని KCR గుర్తు చేశారు. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని తానే చొరవ చూపించానన్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం బాధాకరమన్నారు. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్పూర్తికి ఇది విఘాతం కలిగించిందని అభిప్రాయపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.

కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని KCR అధికారులను ఆదేశించారు. గోదావరి నికర జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 950 TMCల నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని అన్నారు. గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 TMCలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రోజుకు రెండు TMCల నీటిని లిఫ్టు చేయడానికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News