రానున్న రోజుల్లో మరింత కష్టం: డబ్ల్యూహెచ్ఓ

Update: 2020-05-12 14:48 GMT

ఇంకెన్ని రోజులు లాక్డౌన్‌లో ఉండాలని కొందరు.. కేసులు కాస్త తగ్గుతున్నాయని మరి కొందరు.. మొత్తానికి రాష్ట్రాల్లో కొన్ని సడలింపులు.. వెరసి రోడ్ల మీద పోలీసులు సైతం చేతులెత్తేసే అంత జనం.. ఈ పరిణామాలు అంత శుభ సూచకం కాదని.. రాబోయే కాలంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ దేశాలకు హితవు పలికింది. అశ్రద్ద వహిస్తే మహమ్మారి మరోసారి విరుచుకుపడుతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఆంక్షలు సడలించిన దేశాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జర్మనీ, దక్షిణ కొరియాలో ఆంక్షల సడలింపుల అనంతరం నైట్ క్లబ్‌లు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యుహెచ్‌ఓ ప్రపంచ దేశాల్ని అప్రమత్తం చేస్తోంది. లాక్డౌన్ అనంతరం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అత్యవసర విభాగం చీఫ్ మైకేల్ ర్యాన్ సూచించారు. ఆంక్షల సడలింపు అనివార్యం అయినప్పటికీ.. దశలవారీగా సడలించడం మరింత ముఖ్యమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ అభిప్రాయపడ్డారు. పటిష్టమైన చర్యలు తీసుకోకుండా వ్యవహరించడం చాలా ప్రమాదకరమని టెడ్రోస్ హెచ్చరిస్తున్నారు.

Similar News