కరోనాతో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా దేశం నష్టపోయిందని ఆయన అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన 20 లక్షలకోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని ఆయన తెలిపారు. ఈ ప్యాకేజీ ల్యాండ్, లేబర్, లా, లిక్విడిటీలకు బలం చేకూర్చేలా ప్యాకేజీ ఉండనుందని మోదీ స్పష్టం చేశారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని ఆయన అన్నారు.
మంగళవారం జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన ఈ మేరకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటిచారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేది దేశం నినాదం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం కరోనాతో నాలుగు నెలల నుంచి పోరాడుతోందని అన్నారు. ఈ వైరస్ ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగించిందని.. దీంతో ప్రపంచం సంక్షోభంలోకి పోయిందని అన్నారు. ప్రపంచం మొత్తం కలిసికట్టుగా పోరాడుతోందని.. కానీ, మరింత సంకల్పంతో పోరాడాల్సి ఉందని ఆయన అన్నారు. ఇది ఒక పెద్ద ఆపదని.. అయితే.. ఇది మనల్ని అవసరం వైపు నడిపించిందని అన్నారు.
ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని.. కరోనాతో వచ్చిన సవాళ్లను చాలా వరకు అధిగమించామని ఆయన తెలిపారు. కరోనా దేశంలో ప్రవేశించేనాటికి.. దేశంలో దగ్గర ఒక్క పీపీఈలు, N -95 మాస్క్‌లు ఉత్పత్తి కాలేదని అన్నారు. కానీ ఇప్పుడు రోజూ 2లక్షల పీపీఈ కిట్లు, 2లక్షల N - 95మాస్కుల్ని తయారుచేస్తున్నామని అన్నారు.