కరోనా మనకున్న చెడ్డ అలవాట్లని, అధికారుల్లో అలసత్వాన్ని రూపు మాపనుందేమో.. కరోనాకి ముందు ఎలా ఉన్నా ఆ తరువాత వైరస్ వ్యాప్తిని నిరోధించే ప్రక్రియలు చేపట్టాలనుకుంటున్నాయి చాలా ప్రభుత్వాలు. అందులో భాగంగానే బ్రిటన్ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన యోర్క్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని నగరంలో కేవలం సైకిళ్లు, ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. నగరంలో సైకిళ్లను ప్రోత్సహించేందుకు రవాణా మంత్రి గ్రాండ్ షాప్స్ ఏకంగా రెండు బిలియన్ పౌండ్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
చారిత్రక కట్టడాలు అధికంగా కలిగిన యోర్క్ నగరంలో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా 2023 సంవత్సరం నుంచి ప్రైవేట్ కార్లను నిషేధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అనుకోకుండా కరోనా వచ్చి పడింది. దీంతో ఇప్పటి నుంచే అంటే లాక్డౌన్ అనంతరం సైకిళ్లు, ఎలక్ట్రిక్ కార్లను మినహా మరే ఇతర వాహనాలను అనుమతించరాదని నిర్ణయించింది. కాగా, యోర్క్ నగరాన్ని ఏటా 70 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.