20 ఏళ్లలో 5 వైరస్‌లు.. ఏం సాదిద్దామని..: బ్రయాన్ సీరియస్

Update: 2020-05-13 19:53 GMT

కరోనా వైరస్ వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 2,50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. ఇంతటి భీభత్సానికి కారణమైన చైనా ఈ విషయంపై మిన్నకుండి పోయింది. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోంది అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ రాబర్ట్ ఓ బ్రయాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనా నుంచి వచ్చే ఇలాంటి విపత్తులను ఇక భరించడం కష్టం.

ఒకటా రెండా 20 ఏళ్లలో అయిదు మహమ్మారులను ప్రపంచం మీదికి వదిలారు. సార్స్, బర్డ్‌ ప్లూ, స్వైన్ ప్లూ, కరోనా ఇవన్నీ చైనా నుంచి వచ్చినవే. ఎందాక భరించాలి.. ప్రాణం నష్టం, ఆర్థిక నష్టం.. కోలుకోవాలంటే ఎంత కష్టం.. ఈ భయంకరమైన పరిస్థితిని ఇంకెంతో కాలం భరించలేమని బ్రయాన్ వ్యాఖ్యానించారు. చైనాలో పబ్లిక్ హెల్త్ క్రైసిస్‌ను నిలువరించడం కష్టసాధ్యమైన పని. కావాలంటే ఇలాంటి వైరస్‌లను నివారించడానికి అమెరికా సహాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. దాదాపు 212 దేశాలు కరోనా బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు కూడా బాగా దెబ్బతిని కోలుకోలేని విధంగా ఉన్నాయని బ్రయాన్ తెలిపారు.

Similar News