కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

Update: 2020-05-14 08:40 GMT

లోకల్‌ బ్రాండ్స్‌కు మద్దతు ఇవ్వాలన్న ప్రధాని మోదీ పిలుపుకు మంచి స్పందన వస్తోంది. ఇందులో భాగంగా మొదటిసారిగా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి పారామిలిట‌రీ క్యాంటీన్లలో కేవ‌లం స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే అమ్మాల‌ని నిర్ణయించింది. ఈ ఆదేశాలు జూన్ 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. దీంతో ఇక‌పై సీఏపీఎఫ్ క్యాంటీన్లలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు మాత్రమే ల‌భించ‌నున్నాయి.ఈ మేర‌కు హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. దీంతో లోకల్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌కు ఇది తొలి అడుగు పడినట్లైంది.

హోంశాఖ తాజా నిర్ణయంతో సుమారు 10 లక్షల మంది పారామిలిటరీ సిబ్బందితోపాటు వారి కుటుంబంలోని 50 లక్షల మంది సభ్యులు స్వదేశీ ఉత్పత్తులను వాడనున్నారు. పారామిలిటరీ క్యాంటీన్లు ప్రతి ఏటా 2 వేల 800 కోట్ల లోకల్‌ బ్రాండ్స్‌ అమ్మకాలను జ‌రుపుతున్నాయి. సీఏపీఎఫ్‌లో సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్ఎన్‌‌జీతోపాటు అస్సాం రైఫిల్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి పారామిలిటరీతో పాటు ప్రజలంతా లోకల్‌ ప్రొడక్ట్స్‌నే వాడాలని హోంశాఖ కోరింది.

మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. అందరూ స్థానిక‌ వస్తువులను ప్రోత్సహించాలని కోరారు. ఈ నిర్ణయం భార‌త్‌ను రాబోయే రోజుల్లో ప్రపంచ నాయ‌క‌త్వ మార్గంలోకి తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్వేదేశీ ఉత్పత్తులను ప్రమోట్‌ చేసేందుకు మరిన్ని సంస్థలు కూడా చర్యలు చేపట్టాయి. మరోవైపు కరోనాపై పోరుకు ప్రధాని కేర్స్‌ ట్రస్ట్‌ 3 వేల 100 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో 100 కోట్లు వ్యాక్సిన్‌ తయారీకి, వెంటిలేటర్ల కొనుగోలుకు 2 వేల కోట్లు, వలస కూలీల కోసం వెయ్యి కోట్లు కేటాయించింది.

Similar News