సస్పెన్షన్‌కు గురైన అనస్థీషియా నిపుణుడు డాక్టర్ సుధాకర్‌ను.. తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. డాక్టర్‌ను కలిసేందుకు ఆయన మాతృమూర్తికి కూడా అవకాశం ఇవ్వలేదన్న ఆరోపణలపై.. సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది పి. వీరారెడ్డిని నియమించింది. డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ.. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను కోర్టు సుమోటోగా స్వీకరించింది. లేఖకు జతచేసిన వీడియోను కూడా పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ చేపట్టింది.
సస్పెన్షన్‌కు గురైన డాక్టర్ సుధాకర్ పట్ల ఈ నెల 16న విశాఖ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆయన దుస్తులు ఊడదీసి అర్ధనగ్నంగా చేసి, తాళ్లతో చేతులను వెనక్కి విరిచి కట్టారు. రోడ్డుపై పడుకోబెట్టి అమానవీయంగా ప్రవర్తించారు. నర్సీపట్నం ప్రాథమిక వైద్య కేంద్రంలో మాస్కులు లేవని, సరైన వైద్య సదుపాయాలు లేవని ప్రశ్నించిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడమే కాకుండా.. విశాఖ పోలీసుల అమానుష ప్రవర్తనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది.
ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ప్రచారం జరుగుతోందన్నారు. న్యాయస్థానాలను రాజకీయాలకు వాడుకోరాదని.. కోర్టులు కూడా వాస్తవాలు గ్రహించి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. మీరు పోలీసుల చర్యలను సమర్థిస్తున్నారా..? అంటూ ఏజీని ప్రశ్నించింది. అయితే, తాను ఎవరినీ సమర్థించడం లేదని.. నిజాలు తెలుసుకోవాలని మాత్రమే విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుంటే, సుధాకర్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన విశాఖ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు.