ఎల్జీ పాలిమర్స్ ఘటనపై 20 ప్రశ్నలు.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించటమే పాపమా?
12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు..ఆమెకు సహకరించాడనే ఆరోపణలపై మల్లాడి రఘునాథ్ కు కూడా నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన్ను కలిసి నోటీసులు అందించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41-ఎ కింద ఇప్పుడు రఘునాథ్‌కు సీఐడీ నోటీస్ ఇచ్చింది. కుట్రపూరితంగానే సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నోటీసుల నేపథ్యంలో త్వరలో రఘునాథ్ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన విచారణలో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకున్న అధికారులు తమకు అందిన ఫిర్యాదుల మేరకు కొందరిపై చర్యలకు సిద్ధమయ్యారు.
LG పాలిమర్స్ ప్రమాదంపై ఫేస్‌బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్స్ పెట్టారంటూ గుంటూరు లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన రంగనాయకమ్మకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. IPC సెక్షన్లు 505 ఆఫ్ టు, 153 (ఎ), 188, 120-బి రెడ్‌విత్ 34...ఐటీ చట్టం 67 ప్రకారం కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత.. వాటిని రంగనాయకమ్మే పోస్ట్ చేసినట్లు గుర్తించామని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఆమెకు CRPC సెక్షన్ 41-A ప్రకారం నోటీసులు అందజేశారు. రంగనాయకమ్మకు సహకరించారనే ఆరోపణలతో మల్లాది రఘునాథ్ గురించి కూడా దర్యాప్తు చేపట్టి నిన్న ఆయనకు కూడా నోటీసులు అందించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం కేసులో రంగనాయకమ్మ ఏ1 కాగా రఘునాథ్ ఏ2 అని సీఐడీ పేర్కొంది. ఈ కేసులో నేరం రుజువైతే మొదటిసారి 3 ఏళ్ల జైలు, 5 లక్షల జరిమానా విధిస్తారు. అదే నేరాన్ని మరోసారి చేస్తే ఐదేళ్ల జైలు.. 10 లక్షల జరిమానా ఉంటుందని సీఐడీ అధికారులు వెల్లడించారు.
ఎల్జీ పాలిమర్స్ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది చనిపోయారు. 5 గ్రామాల్లోని 15 వేల మంది ప్రజలు మృత్యువుతో సహజీవనం చేస్తున్నట్లు భయపడాల్సిన దుస్థితి. 15 వేల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎల్జీ పాలిమర్స్ పై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం 12 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి కూడా నామమాత్రపు కేసులతో చేతులు దులిపేసుకున్నారు. కానీ, అదే ఘటనలో ఎల్జీ పాలిమర్స్ ను సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం పగ సాధిస్తోందంటూ ప్రతిపక్షాలు, మానవహక్కుల వేదిక, ఐద్వా మండిపడ్డాయి. ఇది దుర్మార్గమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో దుర్ఘటనపై 20 ప్రశ్నలను ఫేస్బుక్ రంగనాయకమ్మ షేర్ చేశారు. ఆ ప్రశ్నలకు బదులివ్వలేని ప్రభుత్వం..తమపై దుష్ఫ్రచారం చేస్తున్నారంటూ ఓ 66 ఏళ్ల వృద్ధురాలిని కూడా పగబట్టి మరీ కేసులతో వేధిస్తోందంటూ సీపీఐ, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాయకమ్మకు అండగా ఉంటామన్నారు. నియంతృత్వపు పోకడలతో ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆరోపించారు. అదేంటని తప్పులను ప్రశ్నిస్తే..వాటిని సరిదిద్దుకోవటం మానేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఫైర్ అయ్యారు.