రంగనాయకమ్మను రెండున్నర గంటలపాటు విచారించిన సీఐడీ

Update: 2020-05-22 12:12 GMT

విశాఖ పాలిమర్స్‌ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారని అభియోగాలను ఎదుర్కొంటున్న పూదోట రంగనాయకమ్మను సీఐడీ విచారించింది. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆమె విచారణకు హాజరయ్యారు. విచారణాధికారి దిలీప్ కుమార్, గుంటూరు ఏఎస్పీ విజయపాల్‌లు దాదాపు రెండున్నర గంటలపాటు ఆమెను విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 20 అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ కేసులో రెండో నిందితుడు మల్లాది రఘునాథ్‌ను విచారించిన తర్వాత మరోసారి విచారణకు పిలుస్తామంటూ రంగనాయకమ్మను పంపించేశారు.

ఎల్జీ పాలిమర్స్‌పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టడంపైనే ప్రధానంగా సీఐడీ విచారించినట్లు సమాచారం. రఘునాథ్‌ షేర్‌ ఆప్షన్‌ లేకుండా ఫేస్‌బుక్‌లో పోస్టు పెడితే... దాన్ని కాపీ చేసి మీ ఫేస్‌బుక్‌లో పెట్టాల్సిన అవసరం ఏంటని అధికారులు రంగనాయకమ్మను ప్రశ్నించారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలనేది తన ఉద్దేశం కాదని, ప్రజల అభిప్రాయాలనే చెప్పానని సమాధానం ఇచ్చినట్లు విచారణ తర్వాత రంగనాయకమ్మ తెలిపారు.

ఇక భోపాల్ గ్యాస్‌ను ప్రస్తావిస్తూ పోస్టు పెట్టారు. ఆ దుర్ఘటన గురించి శాస్త్రీయంగా మీకేమైనా తెలుసా అని సీఐడీ ప్రశ్నించింది. ఇలా చేయడం ప్రజలను రెచ్చగొట్టడం కాదా అంటూ అధికారులు ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించి ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారని, స్టైరీన్‌ను వెనక్కి తరలించారని పోస్టు ఎలా పెట్టారు? వాటికి సంబంధించిన ఆధారాలేమైనా మీ వద్ద ఉన్నాయా.. ఇలా ప్రశ్నల పరంపరను అధికారులు కొనసాగించినట్లు సమాచారం. ఇక విచారణ తర్వాత గతంలోనూ రంగనాయకమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ సీఐడీ ఒక ప్రకటన విడుదల చేసింది.

సీనియర్ సిటిజన్ రంగనాయకమ్మను సీఐడీ రెండున్నర గంటలపాటు విచారించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రంగనాయకమ్మను కలిసి సీపీఐ నేతలు సంఘీభావం తెలిపారు.

Similar News