పొట్టకూటికోసం ఊరుకాని ఊరు వచ్చిన కొందరు వలసజీవుల జీవితాలపై కరోనా కన్నెర్ర చేసింది. లాక్ డౌన్ కారణంగా సుదూర ప్రాంతాలకు నడక దారిపట్టిన కొందరు వలస బాటసారుల జీవితాలు మధ్యలోనే తెల్లారిపోయాయి.
వలస కార్మికులను వారి స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన శ్రామిక్ స్పెషల్ రైళ్లలో మే 9 నుంచి మే 27 మధ్య 80మంది మరణించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వారిలో ఒకరు కరోనావైరస్ కారణంగా మరణించగా, మరికొంత మంది అనారోగ్యంతో మరణించారు. ఇందులో మే 23న 10మంది, మే 24, మే 25న 9 మంది, మే 27న 8, మే 26న 13 మంది మరణించారు.
లాక్డౌన్లో చిక్కుకున్న వలస కార్మికులు మొదట్లో తమ స్వస్థలాలకు చేరుకోవడానికి చాలా దూరం నడిచారు.. ఇలా నడిచిన వారు కొందరు అనారోగ్యం మధ్యలోనే మరణించారు. వారిలో ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చనిపోయిన తల్లిని మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్న ఒక పిల్లవాడి వీడియో ఇటీవల హృదయ విదారక చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన చూసిన పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా వలసకూలీల కోసం శ్రామిక్ ప్రత్యేక రైళ్లను మే 1న ప్రారంభించారు.. వీటిద్వారా ఇప్పటికే లక్షలాది వలసకార్మికులు తమ ఇళ్లకు చేరుకున్నారు.