డాక్టర్ చదువంటేనే లక్షలతో వ్యవహారం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఫీజులను భారీగా తగ్గించింది. మెడికల్, డెంటల్ ఇలా అన్ని కేటగిరిల్లో 70 శాతం వరకు ఫీజుల్లో కోత విధించింది. మెడికల్‌లో కన్వీనర్ కోటా ఫీజు రూ.6.90 లక్షల నుంచి రూ.4.32 లక్షలకు తగ్గించారు. అదే విధంగా గత ఏడాది రూ.24 లక్షలున్న యాజమాన్య కోటా ఫీజును రూ.8.64 లక్షలకు కుదించారు. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సూచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా నిర్ణయించిన ఫీజులు 2020-21, 2022-23 వరకు అమల్లో ఉంటాయి. ఈ ఫీజుల్లోనే ట్యూషన్, అడ్మిషన్, స్పెషల్, లేబొరేటరీ, కంప్యూటర్, ఇంటర్నెట్ ఫీజులు ఉంటాయి. ఆయా ఫీజులను మెడికల్ కాలేజీలు విద్యార్థుల దగ్గర నుంచి రెండు విడతల్లో కట్టించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఫీజులు కాకుండ విద్యార్థుల దగ్గర నుంచి అదనంగా వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలా చేస్తే ఆయా మెడికల్ కాలేజీలకు భారీ జరిమానా విధిస్తామన్నారు.