22 ఏళ్ల యువకుడు చైన్ స్నాచింగ్‌లో ఆరి తేరాడు. పోలీసులకు దొరక్కుండా గొలుసులు ఎలా కొట్టేయాలో తెలిసిపోయింది. ఈ విద్య ఏదో నలుగురికీ నేర్పితే నాలుగు రాళ్లు సంపాదించొచ్చనుకున్నాడు. ఇంటినే దోపిడీ శిక్షణ పాఠశాలగా ఏర్పాటు చేశాడు ఢిల్లీ బవానాకు చెందిన మనీష్. ఇంతకు ముందు చోరీలు చేసి అరెస్ట్ అయ్యాడు. అయినా బెయిల్ మీద బయటకొచ్చి హ్యాపీగా తన పాత పద్దతినే మొదలు పెట్టాడు. పాఠశాల కూడా స్థాపించాడు.
నేరుగా దొంగతనాలు మొదలు పెడితే పోలీసులు పట్టుకుంటున్నారని భావించి యువ స్నాచర్లను తయారు చేసే పనిలో పడ్డాడు. తద్వారా డబ్బు సంపాదించాలనుకున్నాడు. దొంగ తనానికి ఏ ప్రాంతాన్ని ఎంచుకోవాలి, దొరికితే ఎలా తప్పించుకోవాలి అనే వాటిపై శిక్షణ ఇచ్చేవాడు. ఇక దోచుకున్న సొమ్ములో 50% కమీషన్ తీసుకునేవాడు. ఈ నేపథ్యంలో మనీష్ మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో మనీష్ తప్పించుకోబోతే పోలీసులు కాల్పులు జరిపారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.