తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం కేటాయించిన ఆవ భూములపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇళ్ల స్థలాల కోసం భూమిని చదునుచేయడం వల్ల వ్యవసాయ భూములు మునిగిపోతాయని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అయితే తాము ఆ స్థలాలను చదును చేయడం లేదని చెబుతోంది ప్రభుత్వం. దీంతో తాజా పిటిషన్‌ను గతంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో జత చేయాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణను వేసవి సెలవుల తర్వాతకి వాయిదా వేసింది.
పేదలకు ఇళ్ల స్థలాల కోసం బూరిగపూడి గ్రామంలో 600 ఎకరాల ఆవ భూముల్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. అయితే స్థానికంగా ఉన్న ధరకంటే చాలా ఎక్కువ రేటు చెల్లించి భూములు కొనుగోలు చేశారంటూ ఇప్పటికే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యవహారంలో 400 కోట్ల మేర దోపిడీ జరిగిందన్న ఆరోపణలున్నాయి. అంతే కాదు ఏడాదిలో ఆరేడు నెలలు ముంపునకు గురై.. నీటిలోనే ఉండే ప్రాంతాలను పేదల ఇళ్ల కోసం సేకరించడంపైనా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.