తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లాలో జెండా ఆవిష్కరిస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో స్థానిక అంగన్ వాడీ టీచర్ భర్త అశోక్ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. అంగన్ వాడీలో ఆయాగా పనిచేస్తున్న కలవ్వ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
అంగన్ వాడీ కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై దొమ్మాట గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశోక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ప్రభుత్వ పరంగా 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. గాయపడిన కలవ్వకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.