ఏపీ ప్రభుత్వంపై పెదవి విరుస్తున్న అధికారపార్టీ కీలక నేతలు

Update: 2020-06-02 18:29 GMT

వైసీపీ పరిపాలనపై ప్రతిపక్షాలే కాదు. అధికార పార్టీ నేతలు సైతం విసుగెత్తిపోతున్నారు. ప్రభుత్వ విధానాలు, పథకాల అమలు, అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వేదికలపై, పబ్లిక్‌గా.. తమ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. స్వయంగా మంత్రులే పరిపాలనలో లోపాలను బహిరంగంగానే చెబుతున్నారంటే పరిస్థితి ఏ రేంజ్‌కు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. తమది మచ్చలేని స్వచ్ఛమైన ప్రభుత్వమని.. అక్రమాలకు తావులేదని చెప్పుకునే ప్రభుత్వం.. అసలు రంగును సొంత పార్టీ నేతలే బయట పెడుతుండడం సంచలనంగా మారింది. ఏడాది పాలన పూర్తి చేసుకొన్న ముఖ్యమంత్రి జగన్‌.. తొలి ఏడాదిలోనే ఎన్నో చేశామని చెప్పుకుంటుండగా.. అసలు విషయాల్ని అధికార పార్టీ నేతలే బయటపెడుతున్నారు.

ఇసుక రవాణాలో జరుగుతున్న అక్రమాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయని అన్నారాయన. ఆన్‌లైన్‌ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని మంత్రి అంగీకరించారు. ఇసుక రీచ్‌కు, యార్డ్‌కు మధ్య 2 లక్షల మెట్రిక్ టన్నుల తేడా వచ్చిందని స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే చెప్పారు. ఈ విషయంలో సిబ్బంది, రవాణా ఏజెన్సీల పాత్రపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇసుక లభ్యతలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి పెద్దిరెడ్డి.. గ్రామ-వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుక్ చేసే విధానంపై ఆలోచిస్తున్నామన్నారు.

ఇక, గుంటూరు జడ్పీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా ఇసుక పాలసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క పల్లెటూళ్లో కూడా కనీసం దోసెడు ఇసుక ఇవ్వలేకపోతున్నామని కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వ లోపాన్ని సమావేశంలోనే బయటపెట్టారు. నాడు-నేడులో కూడా తట్టెడు మట్టి ఇవ్వలేకపోతున్నామని వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అన్నారు. చెబుతున్నదొకటి.. వాస్తవంలో జరుగుతున్నది మరొకటి అంటూ అసలు విషయాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా ఒప్పుకున్నారు. రీచ్‌ నుంచి వస్తున్న ఇసుక లారీలు దారి మధ్యలోనే మాయం అవుతున్నాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.

Similar News