ఏపీలో కరోనా జోరు.. నిబంధనలకు అనుగుణంగా టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Update: 2020-06-03 10:15 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది..గడచిన 24 గంటల్లో 12 వేల 613 మంది నమూనాలు పరీక్షించగా 115 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.. అయితే ఇందులో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు 33 మంది ఉండగా.. రాష్ట్రంలో 82 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3 వేల 791 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. 40 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 64 మంది మృతి చెందారు. ఇక వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2 వేల 209కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 927 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను తెలియజేయడం లేదు ప్రభుత్వం.. అయితే రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్లేస్‌లో గుంటూరు జిల్లా ఉంది. ఇక చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు బయటపడుతున్నాయి.

ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పాజిటివ్ కేసులు 479 కాగా ఇందులో ప్రస్తుతం 282 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే విదేశాల నుంచి వచ్చిన 112మందికి వైరస్ సోకినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది ఆరోగ్య శాఖ. అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా కేసులు పెరిగిపోవడం టెన్షన్ రేపుతోంది..అందుకే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది . ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ నుంచి వచ్చిన వారికి తప్పనిసరిగా టెస్టులు నిర్వహిస్తున్నారు.

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జులై 10 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ప్రతి గదిలో కేవలం 10 నుంచి 12 మంది మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించడంతోపాటు.. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించేలా ఆదేశాలు జారీ చేశారు. . బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల కోసం 8లక్షల మాస్కులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు..అటు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News