జలదీక్షలకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు.. అడ్డుకున్న పోలీసులు

Update: 2020-06-02 19:10 GMT

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన జల దీక్షల్ని.. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. జలదీక్షకు ఎవరూ వెళ్లకుండా ముఖ్య నేతలందరినీ గృహనిర్బంధం చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్ద జలదీక్షలకు రేవంత్‌ రెడ్డి బయలుదేరుతుండగా.. ఆయన్నుపోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ.. కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఇళ్ల వద్ద జలదీక్షలు చేపడుతున్న రామ్మోహన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, నర్సింహారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్‌ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

పాలేరు జలాశయం వద్ద జలదీక్ష చేపట్టాలని భావించిన.. CLP నేత భట్టి విక్రమార్క.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో దీక్ష చేశారు. పాలేరు జలాశయం వద్దకు భట్టి వెళతారని.. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే ఆయన అక్కడికి వెళ్లకపోవడంతో.. భట్టిని అరెస్టు చేసేందుకు పోలీసులు హడావుడి చేస్తున్నారు.

ఏటూరునాగారం గోదావరి వద్ద ఎమ్మెల్యే సీతక్క తలపెట్టిన జలదీక్షను అడ్డుకుని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల చర్యలకు నిరసనగా.. ములుగు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట ఆమె ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి నీళ్లు అందించకుండా.. ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని సీతక్క మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాలపై వివక్ష చూపతున్నారని ఆమె ఆరోపించారు.

Similar News