వాటర్‌ వార్‌.. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులపై ముదిరిన దుమారం

Update: 2020-06-03 08:36 GMT

రెండు రాష్ట్రాల మధ్య రాజుకున్న జల వివాదం మరోసారి తెరపైకి రానుంది. కృష్ణా జలాల నీటి పంపకాలపై చర్చించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో కృష్ణ రివర్‌ బోర్డు సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగే ఈ సమావేశంలో నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాలు సూచించే అంశాలను కూడా కృష్ణా బోర్డు పరిగణలోకి తీసుకోనుంది. అయితే..జీవో 203తో జల జగడం ముదిరిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సమావేశంలో ఏయే అంశాలను బోర్డు దృష్టికి తీసుకురానున్నారు. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోవాలన్న తెలంగాణ తమ వాదనను ఎలా సమర్ధించుకోనుంది..ఏపీ ఎలా కౌంటర్‌ ఇవ్వనుందనేది రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

కృష్ణా బేసిన్‌ నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంపై ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య పంచాయతీ ముదిరింది. పోతిరెడ్డి పాడు సామార్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 దీనికి వివాదానికి కారణంగా మారింది. శ్రీశైలం నుంచి రాయలసీమకు కృష్ణా నీటిని తరలించే లక్ష్యంతో పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచాలన్నది ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన. అయితే ఏపీ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు లేఖ కూడా రాసింది. అటు ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణలోని కృష్ణా బేసిన్‌ పై చేపట్టిన ప్రాజెక్టులపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బోర్డుకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలోనే రేపటి బోర్డు సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే.. గురువారం జరగనున్న సమావేశానికి సంబంధించి కృష్ణా రివర్‌ బోర్డు...రెండు రాష్ట్రాలకు 5 అంశాలతో అజెండాను పంపించింది. ఇందులో ఏపీ, తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులు, అభ్యంతరాలు, ప్రాజెక్టులు, డీపీఆర్‌ లపై చర్చించనున్నారు. అలాగే వచ్చే ఏడాదికి సంబంధించి నీటి పంపకాలపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఇక కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులలో కొన్నిచోట్ల టెలిమెట్రిక్‌ విధానం లేకపోవటంతో నీటి వినియోగం లెక్కల్లో తేడాలు ఉన్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో మూడో అంశంగా నీటి వినియోగానికి సంబంధించి టెలిమెట్రిక్‌ ఏర్పాటుపై చర్చించనున్నారు. అలాగే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ కింద పవర్‌ వినియోగం, బోర్డుకు సంబంధించి ఇరు రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని కూడా రేపటి సమావేశంలో ప్రస్తావించనున్నారు.

Similar News