ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3,795 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) గ్రేడ్ –2 పోస్టులను భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కొన్నేళ్లుగా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)గా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం ప్రాతిపదికన వీఆర్‌వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి.
దాంతో దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. 3,795 వీఆర్‌వో పోస్టులను ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్‌ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతినిచ్చింది. అయితే ఇందుకు గాను ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వీఆర్‌ఏలుగా ఐదేళ్ల సర్వీసును పూర్తి చేసుకొని ఉండాలి.