రాజ్యసభ ఎన్నికల ముందు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మొత్తం 8 మంది ఎమ్మెల్యేల తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా చేయగా.. బుధవారం మరో ఇద్దరు.. తాజాగా మరొకరు రాజీనామా చేయడంతో శాసనసభలో ఆ పార్టీ బలం మరింత తగ్గింది. శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మోర్బీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బ్రిజేష్ మెర్జా తన రాజీనామాను స్పీకర్ రాజేంద్ర త్రివేది అంగీకరించినట్లు అసెంబ్లీ సచివాలయం ధృవీకరించింది.
కాగా శాసనసభ్యుడు పదవి నుంచి తప్పుకునే ముందు, మెర్జా కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో గత మూడు రోజుల్లో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది. అలాగే గతంలో ఐదు మంది రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఎనిమిది మంది సభ్యుల రాజీనామాతో.. గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 57కు తగ్గింది.