కరోనా లక్షణాలు ఉన్నా, వ్యాధి నిర్ధారణ అయినా ఇకనుంచి క్వారంటైన్ లోనో, ఆస్పత్రిలోనో ఉండాల్సిన అవసరం లేదు. 17 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ డాక్టర్ చెప్పిన ప్రకారం మందులు వేసుకుంటూ, ఆహారం తీసుకుని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకవేళ కరోనా లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే అప్పుడు తక్షణం వైద్యుని సలహాలు తీసుకోవాలని పేర్కొంది. చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులు ఇళ్లలో ఉంటే ఈ కరోనా పేషెంట్ వారికి దూరంగా ఉండాలి. అందోళన చెందాల్సిన పనిలేదు అవసరమైతే టోల్ ఫ్రీ 18005994455 నెంబరుకు సంప్రదించాలని కోరింది.
కరోనా పేషెంట్ ఉండే గదిలో గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. వారికి ప్రత్యేక టాయిలెట్ ఉండాలి. ఆరోగ్యవంతులైన కుటుంబసభ్యులే సేవలు అందించాలి.
బాధితుడి ఇంట్లో 55ఏళ్ల పైబడిన వ్యక్తులు, గర్భిణి, క్యాన్సర్, ఆస్తమా, శ్వాసకోశ, మధుమేహం, బీసీ, గుండెజబ్బు, కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వారు, చిన్న పిల్లలు ఉంటే బాధితుడు కోలుకునే వరకు వారిని వేరే చోటుకి పంపించాలి.
వైద్యుడి సలహా మేరకు హైడ్రాక్పీక్లోరోక్విన్ మాత్రలు తీసుకోవాలి. ఈ మాత్రలకు స్థానిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలి. ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆరోగ్య కార్యకర్తలకు ఫోన్ చేసి ఆరోగ్య స్థితిపై పూర్తి సమాచారమివ్వాలి.
బాధితుడికి జాగ్రత్తలు..
ఎల్లవేళలా మాస్క్ ధరించే ఉండాలి. దగ్గినా, తుమ్మినా టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకుని అనంతరం వాటిని చెత్తబుట్టలో వేయాలి. రోజుకి కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలి. తాను ఉంటున్న గదిని తానే శుభ్రం చేసుకోవాలి. శుభ్రపరిచేందుకు ఏదైనా బ్లీచింగ్ లిక్విడ్ ను ఉపయోగించాలి.
ఊపిరితిత్తులపై ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుంది కావునా పొగతాగే అలవాటు ఉంటే మానుకోవాలి.
బాధితుని దుస్తులు వేడినీటిలో డెటాల్ వేసి అరగంట నానబెట్టి ఉతికి ఎండలో ఆరవేయాలి. వైద్యుని సూచన మేరకు కచ్చితంగా మందులు వాడాలి. ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిక్షించుకోవాలి. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
బాధితుడికి సహాయం చేసే వ్యక్తి పాటించవలసిన జాగ్రత్తలు..
అతడి గదిలో వెళ్లినప్పుడు మూడు పొరల మెడికల్ మాస్కు ధరించాలి. వాడిన మాస్కులను ఇంటి బయట కాల్చేయాలి. బాధితుడిని తాకకుండా ఉండాలి. గదిలోకి వెళ్లే ముందు వచ్చిన తరువాత 40 నుంచి 60 సెకన్ల పాటు సబ్బుతో శుభ్రపరచుకోవాలి. రోగి వాడిన వస్తువులను వేరుగా ఉంచడంతో పాటు 30 నిమిషాల సేపు వేడినీటిలో ఉంచి శుభ్రం చేయాలి.
ఇరుగు పొరుగు వారు పాటించాల్సిన సూత్రాలు..
తాము ఉండే ప్రాంతంలో వ్యక్తికి కరోనా సోకిందని ఆందోళనకు గురికావద్దు. అపార్ట్ మెంట్లలో ఉంటే తరచూ మెట్లు, గోడలు, లిప్ట్ బటన్లను శానిటైజర్ తో క్లీన్ చేయాలి.
క్వారంటైన్ స్టాంపు ఉన్న వ్యక్తులు ఇంట్లో కాకుండా బయట తిరుగుతుంటే టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారమివ్వాలి.
ఆహారం..
బ్రౌన్ రైస్, గోధుమపిండి, ఓట్స్, చిరుధాన్యాలు తీసుకోవాలి. బీన్స్, చిక్కుడు, పప్పు ధాన్యాలు తీసుకుంటే శరీరానికి ప్రొటీన్ అందుతుంది.
సి విటమిన్ వుండే పండ్లు తీసుకోవాలి. ఆహారంలో అల్లం, వెల్లుల్లి, పసుపు ఉండేలా చూసుకోవాలి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
మాంసాహార వంటకాలు.. గుడ్లు, స్కిన్ లెస్ చికెన్, చేపలు తీసుకోవాలి. వారంలో రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి.
శీతల పానీయాలు తీసుకోరాదు.