మొన్న డాక్టర్ సుధాకర్, నిన్న డాక్టర్ అనితారాణి.. ప్రశ్నించిన గొంతు నొక్కేస్తారా?
మొన్న డాక్టర్ సుధాకర్, నిన్న డాక్టర్ అనితారాణి! వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నించడమే నేరమా? అన్యాయాలు, అక్రమాలపై నిలదీస్తే వేధింపులు తప్పవా? మానసికంగానూ హింసిస్తారా? ఈ వరుస ఘటనలు దేనికి సంకేతం? దళిత డాక్టర్లను టార్గెట్ చేశారా? దళితులపై ఈ ప్రభుత్వం కక్షగట్టిందా?రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ ఉదంతం ఇంకా మరిచిపోకముందే..మరో మహిళా డాక్టర్ వైసీపీ నేతలు వేధించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ రెండు ఉదంతాలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. ప్రశ్నించిన పాపానికి కక్ష సాధింపులకు దిగడం.. వేధింపులకు గురిచేయడం ఆ తర్వాత.. మానసిక పరిస్థితి సరిగా లేదంటూ ముద్రవేయడం! ఇప్పటికే డాక్టర్ సుధాకర్ కేసుని సీబీఐకి అప్పగించింది హైకోర్టు. మరి అనితారాణి వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగనుంది? సీఐడీ విచారణతో ఆమెకు న్యాయం జరుగుతుందా? ఇప్పటికే ఈ అంశం హైకోర్టుకు చేరడంతో... న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
డాక్టర్ అనితారాణి... చిత్తూరు జిల్లా పెనుమూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. అక్కడి స్టాఫ్ చేస్తున్న చట్టవ్యతిరేక కార్యకాలాపాలు, అబార్షన్లతోపాటు మెడిసిన్స్‌పైనా సరైన రిపోర్టులు లేకపోవడంపై... జిల్లా కలెక్టర్‌తోపాటు వైద్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. పైగా వైసీపీ నేతలు కొందరు తనను గదిలో బంధించి..చెప్పలేని విధంగా దుర్భాషలాడారని ఆరోపిస్తోంది అనితారాణి. ఆసుపత్రిలో 2 గంటలపాటు వేధించారని కన్నీటి పర్యంతమయ్యారు. బాత్రూంకి వెళితే.. ఫోటోలు, వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను జరిగిన అన్యాయాన్ని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితకు ఫోన్లో వివరించారు డాక్టర్ అనితారాణి. ఈ వాయిస్ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరస్‌గా మారింది... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ఆడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు..విమర్శలు తీవ్రం కావడంతో.. సీఐడీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం . అయితే సర్కారు కనుసన్నల్లో జరిగే సీఐడీ విచారణతో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటోంది అనితారాణి. సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేసింది..
ఓవైపు అనితారాణి కేసును సీఎం జగన్ సీఐడీకి అప్పగిస్తే.. ఇంకోవైపు వైద్య ఆరోగ్య శాఖ ఆమెపై చర్యలు చేపట్టింది. ఆమెను వైద్య ఆరోగ్య శాఖ కమిషనరేట్‌కు సరెండర్ చేశారు చిత్తూరు DMHO డాక్టర్ పెంచలయ్య. ఆమె పనితీరు, ట్రాక్‌రికార్డు బాగాలేదని అన్నారు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రోగులపట్ల ఆమె చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. అనితారాణి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవేనని కొట్టిపారేశారు.
డాక్టర్ అనితారాణి అంశంపై వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకొని.. సమగ్రదర్యాప్తునకు ఆదేశించినట్లు మహిళా కమిషనర్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. అటు దళిత వైద్యుల పట్ల వైసీపీ నేతలు కర్కశంగా ప్రవర్తిస్తున్నారంటూ సీపీఐ, దళిత హక్కుల పోరాట సమితి నేతలు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడినవారిపై వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.