అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులను దగా చేసింది జగన్ సర్కారు. అమరావతిని కాదంటూ మూడు రాజధానులు చేయాలని మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో రాజధానికి 33 వేల ఎకరాల భూములిచ్చిన 29 గ్రామాల రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా మహోద్యమం చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కదం తొక్కారు. ఈ ఉద్యమం 175 రోజులకు చేరింది..
అన్నదాతల ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ఎలాగైనా అణిచివేయాలని జగన్ సర్కారు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ ఎంత అణిచివేయాలని చూస్తే ఉద్యమం అంతగా ఎగిసిపడింది... ఇప్పటికే అదే స్ఫూర్తి కొనసాగుతోంది. నిరసనలు, ఉపవాస దీక్షలు, ధర్నాలు, రాస్తా రోకోలతో అమరావతి ఉద్యమం హోరెత్తింది. ఇంతలో ఊహించని ఉపద్రవం రూపంలో కరోనా వచ్చి ఉద్యమానికి ఆటంకం కలిగించినా రైతుల పోరాట పటిమ ఏమాత్రం మారలేదు..
కరోనా పేరుతో శిబిరాలు ఖాళీ చేయాలని ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వం తరుపున నోటీసులు ఇప్పించారు. కానీ రైతులు ఇళ్లలో కూర్చొని దీక్షలు మొదలు పెట్టారు. దీంతో ఉద్యమాన్ని అణిచివేయాలనే ఆరోగ్య శాఖ నోటీసుల వ్యవహారం కూడా ఫలించలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా ‘ఇంటింటా అమరావతి’, ‘అమరావతి వెలుగు’ పేరుతో వివిధ రూపాల్లో 80 రోజులుగా నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక లాక్‌డౌన్ తర్వాత జూలై 1 నుంచి రెండో దశ పోరుకు సిద్ధమవుతున్నారు రైతులు..
ఎన్నడూ గడపదాటని మహిళలు కూడా ఉద్యమం కోసం మేము సైతం అన్నారు. ఈ 175 రోజుల ఉద్యమంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, తిండీ తిప్పలు లేక పస్తులున్నా కానీ మహిళలు, రైతులు చిన్నాపెద్దా, ముసలి ముతక అనేతేడా లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు..., మహిళలపై తప్పుడు కేసులు, కొట్టడం, తిట్టడం చివరకు కులంరంగు పులమాలని చూసి ప్రభుత్వమే నవ్వులపాలైంది. కానీ రైతులు ఏమాత్రం వెన్నుచూపలేదు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతు జేఏసీ... ఉప రాష్ట్రపతి నుంచి కేంద్ర మంత్రులదాకా ఎంతోమందిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంది. చివరికి కోర్టులను కూడా ఆశ్రయించింది. ఇప్పటికే ఎన్నో కోర్టు కేసుల్లో ఓటమి పాలైనా సరే జగన్ సర్కారు తీరులో మాత్రం మార్పు రాలేదు. మొండి వైఖరిని వీడలేదు..
దాదాపు 6 నెలల ఉద్యమంలో ప్రభుత్వం తమను ఎన్నో రకాలుగా వేధించిందని రైతులు మండిపడుతున్నారు. కౌలు బకాయిలు ఇంతవరకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. మనోవేదనకు గురిచేయడం వల్ల 70మంది రైతులు మృతి చెందలేదా అని నిలదీస్తున్నారు. దీనిపై అంతర్జాతీయ మీడియ కూడా స్పందించిన విషయం ప్రభుత్వానికి తెలియలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతు కుటుంబాల నుంచి వచ్చామని చెప్పే ప్రభుత్వ నాయకులకు రైతులగోడు పట్టదా అంటూ నిలదీస్తున్నారు. దళితులు, బిసిలు, ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల ఘోష మీకు వినపడటంలేదా అంటూ మండిపడుతున్నారు.
అన్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల పోరాటానికి ప్రతిపక్ష తెలుగు దేశం, విపక్షాలు బాసటగా నిలిచాయి. చంద్రబాబు అమరావతిలో పర్యటించి ఉద్యమిస్తున్న రైతుల తరఫున పోరాటానికి దిగారు. ఇప్పటికీ ప్రతిపక్షం ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూనే ఉంది. అయినాసరే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లు ప్రభుత్వం పట్టు వీడడం లేదు. ప్రభుత్వ తీరును కోర్టులు తప్పుబట్టినా సరే జగన్ సర్కారు మనసు మాత్రం మార్చుకోవడం లేదు. మూడు రాజధానుల మాట మరిచిపోవడం లేదు. దీనిపైనే ప్రతిపక్ష టీడీపీ మండిపడుతోంది.
అమరావతి కోసం ఉద్యమం మరోసారి ఉధృతం కాబోతోంది. రైతుల పోరాటాన్ని ప్రభుత్వం ఎంతగా అణిచివేయాలని చూస్తున్నా... అది అంతగా ఎగిసిపడుతోంది. ఇకనైనా ప్రభుత్వం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.