ఏపీలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Update: 2020-06-10 08:43 GMT

నైరుతి రుతు పవనాలు, అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. బుధ, గురువారాల్లో ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే.. పశ్చిమ గోదావరి , విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు ‘బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గడిచిన 24 గంటల్లో అల్పపీడనంగా మారింది.

అయితే దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ స్థాయి ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాగల 36 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలావుంటే నైరుతి పవనాల ప్రభావంతో గత 24 గంటల్లో విశాఖపట్నం, గుంటూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

Similar News