కరోనాను కంట్రోల్ చేసేందుకంటూ నకిలీ బ్లీచింగ్ పౌడర్ చల్లిన ఘరానా కేటుగాళ్లపై చర్యలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న భారీ కుంభకోణాన్ని టీవీ5 వెలికితీసింది. వరుస కథనాలు ప్రసారం చేయడంతో.. అధికారులు స్పందించారు. నిజాలు నిగ్గు తేల్చి, బాధ్యులను గుర్తించేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా యాక్షన్ మొదలు పెట్టారు. నకిలీ బ్లీచింగ్ కుంభకోణానికి సూత్రధారిగా తేలిన జిల్లా పంచాయతీ అధికారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సస్పెండ్ చేశారు.
ఏపీలో కరోనా కేసులు నమోదవుతున్న తొలినాళ్లలో గుంటూరు జిల్లాలో పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. పారిశుద్ధ్య నిర్వహణను అధికారులు కఠినతరం చేశారు. పలు పట్టణ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఇందులోను అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. ప్రజల ఆరోగ్యం కంటే.. సొంత జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెట్టారు. గుంటూరు జిల్లాలో నకిలీ బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. దానికి కూడా అధిక రేటు చెల్లించారు. ఈ విషయాల్ని టీవీ5 వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా పంచాయతీ అధికారిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కుంభకోణంలో పాత్రధారులైన మరికొందరు అధికారులపైనా వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రజారోగ్యాన్ని విస్మరిస్తూ.. కరోనాకు ఎవరు బలైతే మాకేంటనే విధంగా.. దుర్మార్గంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. నకిలీ బ్లీచింగ్ పౌడర్ చల్లిన కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారికి చెల్లించిన బిల్లులను సైతం వెంటనే రికవరీ చేయనున్నారు. ఈ కుంభకోణానికి జిల్లా పంచాయతీ అధికారిని సూత్రధారిగా భావించి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ స్కాంలో పాత్రధారులైన మరికొందరు అధికారులపైనా చర్యలు తప్పవని తెలుస్తోంది.