అనితారాణి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఉప ముఖ్యమంత్రి

Update: 2020-06-10 22:44 GMT

ఏపీలో సంచలనం రేపిన డాక్టర్ అనితారాణి కేసులో CID విచారణ ప్రారంభించింది. చిత్తూరు జిల్లాలో అనితారాణి పనిచేసిన ఆసుపత్రి, ఆమె ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి CID విచారించింది. మొదట ఆసుపత్రిలో విచారణ చేపట్టిన CID అధికారులు.. అక్కడ పనిచేసే సిబ్బంది, వైద్యుల వద్ద స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు కోసం అనితారాణి ఇంటికి వెళ్లారు. కానీ CID అధికారులతో మాట్లాడడానికి నిరాకరించిన ఆమె.. వారితో ఫోన్‌లో మాట్లాడారు. CIDపై తనకు నమ్మకం లేదని ఆమె చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. అనంతరం పెనుమూరుకు చేరుకున్న CID అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారించారు. ఇక తాము నిష్పక్షపాతంగా విచారణ సాగిస్తున్నామని, దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని CID ఎస్పీ రత్న తెలిపారు.

మరోవైపు డాక్టర్ అనితారాణి కేసులో వస్తున్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పందించారు. అనితారాణి తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని నారాయణ స్వామి అన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన తిరుపతిలో చెప్పారు. ఆమె పేరు, ఆమె కులం గురించి తనకు నిన్నటి వరకు తెలియదన్నారు. డాక్టర్లంటే తనకు దైవంతో సమానమని నారాయణ స్వామి చెప్పారు. CID విచారణలో నిజానిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

Similar News