ఏపీలో ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌

Update: 2020-06-11 08:11 GMT

ఏపీలో కరోనా వైరస్‌ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజువారీ కేసులు మళ్లీ డబుల్‌ సెంచరీ మార్కుని దాటేశాయి. బుధవారం 218 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 5247కి ఎగబాకింది. 24 గంటల్లో 15,384 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం నమోదైన కేసుల్లో 136 మంది స్థానికులు కాగా.. విదేశాల నుంచి వచ్చిన 56 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 26 మందికి వైరస్‌ సోకినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2475 మంది డిశ్చార్జి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాల్లో బుధవారం ఒకరు కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 78కి చేరింది.

కర్నూలు జిల్లాలో ఒకేరోజు 31 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 832కు చేరింది. తాజాగా కేసుల్లో ఆదోనిలో అత్యధికంగా 23 మంది ఉన్నారు. ఈ పట్టణంలో ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా సోకడం కలకలం రేపింది. కొత్త కేసుల్లో ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులే అత్యధికం. గుంటూరు జిల్లాలో మరో 9 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన ముగ్గురికి, హైదరాబాద్‌ నుంచి వచ్చిన మరో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

చిత్తూరు జిల్లాలో నలుగురు వైరస్‌ బారినపడ్డారు. విజయనగరం జిల్లాలో మరోరెండు కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా మూడు కేసులు బయటపడ్డాయి. వీరిలో ఒకరు వలంటీర్‌. కడప జిల్లాలో 42 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో కువైత్‌ నుంచి వచ్చినవి 18, కాగా, సచివాలయ ఉద్యోగుల్లో 11 మందికి, అసెంబ్లీలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Similar News