పొలం విషయంలో సొంత బంధువులే ఓ వృద్ధురాలిని రెండు రోజుల పాటు గదిలో బంధించి హింసించారు. చంపుతామని బెదిరించి రిజిస్టర్ కార్యాలయానికి తీసుకువెళ్లి పొలం రిజిస్టర్ చేయించుకునే ప్రయత్నం చేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన లక్ష్మి.. 5 సంవత్సరాల క్రితం తన పొలాన్ని అక్క నాగమ్మకు అమ్మింది. అయితే..అదే పొలాన్ని తిరిగి తమకు ఇవ్వాలని లక్ష్మి..తన అక్క నాగమ్మను కోరింది. అందుకు ఆమె ససేమిరా అనడంతో అక్క పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని లక్ష్మి ప్లాన్ వేసింది.
ఏరువాక పండుగ నెపంతో అక్క నాగమ్మను తన ఊరుకి తీసుకెళ్లి ఇంట్లో బంధించింది. పాస్ పుస్తకాలు లాక్కొని చంపుతానని బెదిరించింది. బలవంతంగా రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లి పొలం రాయించుకోవాలని చూసింది. నాగమ్మ చేత డాక్యుమెంట్లపై సంతకం చేయిచుకునేందుకు లక్ష్మి కుటుంబసభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. నాగమ్మ గట్టిగా అరిచి కేకలు వేయడంతో చుట్టు పక్కల జనం వచ్చి అడ్డుకున్నారు. ఆమెను వారి చెర నుంచి విడిపించారు.తన చెల్లెలు లక్ష్మీ కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని నాగమ్మ.. కొడుకుతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.