హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. అక్కడా ఇక్కడా అని కాదు.. సిటీ అంతటా పడింది. సిటీ అంతటా దట్టమైన నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలై.. కుండపోతగా కురవడంతో.. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు వరదలా పారాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు.. చుట్టుపక్కల జిల్లాల్లోనూ జల్లులు కురిశాయి.
రాగల 24 గంటల్లో పలు చోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, కోస్తాంధ్ర, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన అల్పపీడనం ఏర్పడింది. రాగల 24గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తెలంగాణాలోని ఉమ్మడి మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది.