మృగశిరకార్తే ముగిసిన రెండు రోజులకే తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు పలకరించాయి. నైరుతి రుతుపవనాలకు తోడు తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి బలపడే అవకాశాలు ఉన్నాయి. నైరుతి ప్రభావం, అల్పపీడనంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమలో సాధారణం కంటే అధిక వర్షాలు పడుతాయని అధికారులు వెల్లడించారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఈ రెండు రోజులు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ, రేపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఇక రుతుపవనాల ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని నల్లమల ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో కుండపోత వాన కురిసింది. దీంతో.. రాచర్ల దగ్గర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల ట్రాక్ పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.నల్లమల, గిద్దలూరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి సగిలేరు వాగు పొంగి పొర్లుతోంది.
మరోవైపు తెలంగాణలోనూ నైరుతీ రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడానికి ఒక రోజు ముందు నుంచే.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. విస్తారంగా వానలు పడుతుండడంతో లోతట్టు ప్రాం తాలు జలమయమయ్యాయి. యాదాద్రి భువనగిరి, ములుగు, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తొలకరి పలుకరించింది. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.