హైకోర్టు దయతోనే బయటికొచ్చా.. లేదంటే పిచ్చోడిని చేసేవారు : డాక్టర్ సుధాకర్
సంచలనంగా మారిన డాక్టర్ సుధాకర్ అరెస్ట్ విషయంలో ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత ఆయన పిచ్చాసుపత్రి నుంచి బయటపడగలిగారు. కానీ, అరెస్ట్ జరిగిన రోజున ఏం జరిగింది? డాక్టర్ కారులో డబ్బు ఏమైంది? నిజంగానే తాగి ఉన్నాడా? లేదంటే రెచ్చగొట్టి అతనికి కోపం తెప్పించి ఆ తర్వాత చర్యలు తీసుకున్నారా? ఇలా ఎన్నో సందేహాలు. అయితే..వాటన్నింటికి కుటుంబ సభ్యులు కొంతవరకు క్లారిటీ ఇచ్చినా..డాక్టర్ సుధాకర్ వర్షన్ పై ఇన్నాళ్లు ఉత్కంఠ నెలకొంది. నాల్గో టౌన్ పోలీసు స్టేషన్ కు వచ్చిన సుధాకర్ అన్ని సందేహాలకు క్లారిటీ ఇచ్చారు. కారుతో పాటు మరికొన్ని వస్తువుల విషయంలో పోలీసు స్టేషన్ కు రావాల్సి వచ్చిందన్న ఆయన..ఆరెస్ట్ జరిగిన రోజున ఎవరో రౌడీ మూకలు తనను వెంబడించి దాడి చేశారని వివరించారు.
హైకోర్టు దయతోనే తాను బయటకు వచ్చానని... లేదంటే పిచ్చోడిని చేసేవారని డాక్టర్ సుధాకర్ అన్నారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకిననే ప్రచారం చేస్తున్నారని..తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని స్పష్టం చేశారు సుధాకర్. తానే మానసిక ఆస్పత్రిలో చేరానని సూపరింటెండెంట్ చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. పోలీసులే తీసుకెళ్లి జాయిన్ చెయించారని చెప్పారు...
అయితే..తాను రాజకీయ పార్టీలకు..రాజకీయాలకు దూరంగా ఉన్నా..నర్సిపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రుల వాళ్లు తనపై కక్ష కట్టారని ఆరోపించారు సుధాకర్. ఎవరెన్ని కుట్రలుచేసినా.. ఎప్పటికైనా నిజం గెలుస్తుందన్నారు..
తనను 21 రోజులుగా మానసిక ఆస్పత్రిలో ఎందుకు ఉంచారో అర్థం కాలేదన్నారు సుధాకర్. మానసిక ఆస్పత్రిలో తనకు రోజుకో ఇంజక్షన్ ఇచ్చేవారని ఆరోపించారు. పదేపదే ఇంజక్షన్లు వేయడం వల్ల కలిగిన గాయాలను ఆయన చూపించారు.
అయితే..డాక్టర్ సుధాకర్ పదేపదే పోలీస్‌స్టేషన్‌కు రావటాన్ని తప్పుబడుతున్నారు విశాఖ పోలీస్ కమిషన్ ఆర్కే మీనా. ఈ అంశం కోర్టులో పరిధిలో ఉందని.. ఇప్పటికే కేసును సీబీఐ హ్యాండోవర్ చేసుకొని దర్యాప్తు చేస్తోందని చెప్పారు..ఇలాంటి సమయంలో సుధాకర్ పదేపదే పోలీస్ స్టేషన్ రావటం వెనక ఏదైనా దురుద్దేశం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులను, సుధాకర్ ను ట్రీట్ చేసిన డాక్టర్లను ప్రశ్నించిన అధికారులు..ఆ రోజు ఏం జరిగిందో స్పష్టమైన రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు.