ప్రతిపక్ష పాత్ర పోషించడమే మా బాబాయ్ చేసిన తప్పా? : ఎంపీ రామ్మోహన్ నాయుడు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. బాబాయ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఈ మేరకు ట్విట్టర్ లో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో అధికారపక్షాన్ని నిలదీసే నిలువెత్తు ప్రజల ధైర్యం మా బాబాయ్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడమే ఆయన చేసిన తప్పా? అంటు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అణచివేతకు గురైన బీసీ వర్గాల గొంతుకగా తన గళాన్ని వినిపిస్తున్న అచ్చెన్నని సభలో ఎదుర్కొనే సత్తా మీ 151 ఎమ్మెల్యేలకూ లేదా? అన్నారు. టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రిని అరెస్టు చేసేటప్పుడు కనీస చట్టబద్ధంగా వ్యహరించడమైనా చేతకాదా? బీసీ నేతలకిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది? ఏసీబీనా? లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలా? అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.